నైరుతి రుతుపవనాల ప్రవేశంలో కొంత జాప్యం

కొన్నేండ్లుగా వాతావరణం మార్పులతో దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంలో కొంత జాప్యం జరుగుతున్నది. దీంతో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న తీరు మారుతున్నది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ ఏడాది నుంచి రుతుపవనాల అంచనా తేదీల్లో మార్పులు చేయనున్నదని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం రాజీవన్‌ అధికారికంగా తెలిపారు. విత్తనాలు నాటుకునే రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.


 


వర్షాకాలం సాధారణం గా జూన్‌ - సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకుతాయి. ఈ తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, మిగతా రాష్ర్టాలకు, ప్రధానంగా మధ్య భారతావనిలోని పది సబ్‌ డివిజన్లలో (ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌, విదర్భ, మధ్య మహారాష్ట్ర, కొంకన్‌, గోవా, గుజరాత్‌లోని కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాలు) నైరుతి రుతుపవనాలు విస్తరించే తేదీల ప్రకటనలో మాత్రమే మార్పు ఉంటుందని ఐఎండీ తెలిపింది.